పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0006-04 బౌళి సం: 01-039 వైరాగ్య చింత
పల్లవి: తీపనుచు చేఁదు తెగఁదిని వెనకఁ బడరాని
ఆపదలచేతఁ బొరలాడేముగాన
చ. 1: అప్పుదీరినదాఁకా నలవోకకైనవా-
రెప్పుడునుఁ దమవార లేలౌదురు
అప్పటప్పటికిఁ బ్రియ మనుభవింపుచు మమత
చెప్పినటువలెఁ దాము సేయవలెఁ గాక
చ. 2: పొందైనవారమని పొద్దు వోకకుఁ దిరుగు-
యిందరునుఁ దమవార లేలౌదురు
కందువగు తమకార్యగతులు దీరినదాఁక
సందడింపుచుఁ బ్రియము జరపవలెఁ గాక
చ. 3: తెగని కర్మము దమ్ముఁ దిప్పుకొని తిరిగాడ
ఆగడుకోరిచి పెక్కులాడ నేమిటికి
తగవేంకటేశ్వరునిఁ దలఁచి యిన్నిటాఁ దాము
విగతభయులయి భ్రాంతి విడువవలెఁ గాక