పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0006-05 శ్రీరాగం సం: 01-040 యజ్ఞము
పల్లవి: అదిగాక నిజమతం బదిగాక యాజకం-
బదిగాక హృదయసుఖ మదిగాక పరము
చ. 1: అమలమగు విజ్ఞానమను మహాధ్వరమునకు-
నమరినది సంకల్పమను మహపశువు
ప్రమదమను యూపగంబమున విశసింపించి
విమలేందు యాహుతులు వేల్పంగవలదా
చ. 2: అరయ నిర్మమకార మాచార్యుఁడై చెలఁగ
వరుసతో ధర్మదేవత బ్రహ్మ గాఁగ
దొరకొన్న శమదమాదులు దానధైర్యభా-
స్వరగుణాదులు విప్రసమితి గావలదా
చ. 3: తిరువేంకటాచలాధిపునిజధ్యానంబు
నరులకును సోమపానంబు గావలదా
పరగ నాతని కృపాపరిపూర్ణ జలదిలో
నరుహులై యవబృథం బాడంగవలదా