పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0006-03 భూసాళం సం: 01-038 తిరుపతి క్షేత్రం
పల్లవి: ఇప్పుడిటు కలగంటి నెల్ల లోకములకు-
నప్పఁడగు తిరువేంకటాద్రీశుఁ గంటి
చ. 1: అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి
ప్రతిలేని గోపురప్రభలు గంటి
శతకోటి సూర్యతేజములు వెలుఁగఁగఁ గంటి
చతురాస్యుఁ బొడగంటి చయ్యన మేలుకంటి
చ. 2: కనకరత్నకవాటకాంతు లిరుగడఁగంటి
ఘనమైన దీపసంఘములు గంటి
అనుపమమణిమయమగు కిరీటము గంటి
కనకాంబరము గంటి గక్కన మేలుకంటి
చ. 3: అరుదైన శంఖచక్రాదులిరుగడఁ గంటి
సరిలేని అభయహస్తము గంటిని
తిరు వేంకటాచలాధిపునిఁ జూడఁగఁ గంటి
హరిఁ గంటి గురుఁ గంటి నంతట మేలుకంటి