పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0006-02 శ్రీరాగం సం: 01-037 భక్తి
పల్లవి: మనసిజ గురుఁడితఁడో మఱియుఁ గలఁడో వేద-
వినుతుఁ డీతఁడు గాక వేరొకఁడు గలఁడో
చ. 1: అందరికి నితఁడెపో అంతరాత్ముఁడనుచు-
నందు రితఁడో మఱియు నవల నొకఁడో
నందకధరుఁడు జగన్నాథుఁడచ్చుఁతుడు గో-
విందుఁ డీతఁడుగాక వేరొకఁడు గలఁడో
చ. 2: తనర నిందరికిఁ జైతన్యమొసఁగిన యాతఁ-
డొనర నితఁడో మఱియు నొకఁడు గలఁడో
దినకరశతతేజుఁడగు దేవదేవుడు, త-
ద్వినుతుఁ డితఁడుగాక వేఱొకఁడు గలఁడో
చ. 3: పంకజభవాదులకుఁ బరదైవ మీతఁడని
అంకింతురితఁడో అధికుఁడొకఁడో
శాంకరీస్తోత్రములు సతతమునుఁ గైకొనెడి-
వేంకటవిభుఁడో కాక వేరొకఁడు గలఁడో