పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0081-03 దేసాళం సం: 01-390 వైష్ణవ భక్తి


పల్లవి:
పరులసేవలు చేసి బ్రదికేరటా
సిరివరుదాసులు సిరులందు టరుదా

చ.1:
కోరి వొక నరునిఁ గొలిచిన వారలు
దీరులై సలిగెలఁ దిరిగేరట
కూరిమి బ్రహ్మండ కోటులేలెడివాని-
వార లింతటఁ జనవరులౌ టరుదా

చ.2:
చేకొన్న తుమ్మిద చేపడ్డ కీటము -
లాకడఁ దుమ్మిదలయీనట
శ్రీకాంతుని పాదసేవకులగు వార -
లేకులజు లయినా నెక్కుడౌ టరుదా

చ.3:
ధరణీశు నాజ్ఞల తమదేశములందు
సిరులనాణెపు ముద్ర చెల్లీనట
తీరువేంకటాద్రి శ్రీదేవుని ముద్రలు
థరియింపఁగా నింతటఁ జెల్లు టరుదా