పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0081-04 గుజ్జరి సం: 01-391

పల్లవి:
ఇటుగన సకలోపాయము లుడిగిన యీశ్వరుఁడే రక్షకుఁడు
తటుకున స్వతంత్రముడిగిన యాత్మకు తగునిశ్చింతమే పరసుఖము

చ.1:
ఆఁకటి కడుగని శిశువుకుఁ దల్లి యడిచి పాలు ద్రాగించినరీతి,
యీకడఁ గోరికలుడిగిన యోగికి నీశ్వరుఁడే రక్షకుఁడు
చేకొని బుద్దెఱిఁగిన జింతింపరు తొల్లిటివలెఁ దల్లులు
యీకొలఁదులనే స్వయత్న దేహుల కీశ్వరుఁడును వాత్సల్యము వదలు

చ.2:
తతిఁ గరిరాజుఁ గాచినయట్లు ద్రాపదిమానము గాచినయట్లు,
హితమతి స్వతంత్రముడిగిన యోగికి యీశ్వరుఁడే రక్షకుఁడు
అతనుఁడు భస్మంబయ్యిననాఁడు అజునిశిరంబటు ద్రుంచిననాఁడు
చతురుఁడుదా నడ్డము రాఁడాయను స్వతంత్రముడుగని జీవులుగాన

చ.3:
దిక్కని యనిశముఁ జిత్తములోనఁ జింతించేటి శరణాగతజనులకు,
యిక్కడనక్కడ శ్రీ వేంకటగిరియీశ్వరుఁడే రక్షకుఁడు
మక్కువతోఁ దనయంతర్యామిని మఱచినస్వామి ద్రోహులకెల్లా
అక్కరతోఁ బుట్టుగులే భోగ్యం బహంకారము విడువరుగాన