పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0069-02 ఆహిరి సం; 01-359 అథ్యాత్మ శృంగారము


పల్లవి:
చెలి నేఁడు తానేమి సేయునమ్మ వెలి యేమిసేయు నీ-
చెలు లేమి సేయుదురు చెలువైన విభుమేనిచెలు వింత సేయఁగా

చ.1
సతి నేఁడు బంగారుచవికెలోఁ జిత్రఁపు-
గతు లెంత చూపినఁ గడకంటఁ జూడదు
అతనిఁజూచినమంచియబ్బురపుఁజూపులు
అతనివెంటనే పోయ నటుగాఁబోలును

చ.2:
తేనియలూరేటి మంచి తియ్యనిమాటలు మంత్ర-
గానములుగా వినుపించి కడువేసరితిమి
వానిమాటలు విన్నవలనైన ముదమున
వీనులు ముద్రించిన విధముగాఁబోలును

చ.3:
నిచ్చళపుమోమున నెయ్యము దైలువారె
బచ్చనచేఁతలు గుబ్బలపై నిండనొప్పెను
అచ్చపువేడుక వేంకటాద్రీశుఁ డీరేయి
నెచ్చెలికి నిచ్చినట్టినేరుపు గాఁబోలును