పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0068-02 సామంతం సం; 01-353 అథ్యాత్మ


పలవి:
అతఁడే సకలవ్యాపకుఁడతఁడే యాతురబంధువుఁ -
డతఁడు దలఁపుల ముంగిట నబ్బుట యెన్నఁడొకో

చ.1:
సారేకు సంసారంబను జలనిధు లీఁదుచు నలసిన-
వారికి నొకదరిదాపగు వాఁడిఁక నెవ్వఁడొకో
పేరిన యజ్ఞానంబను పెనుఁజీఁకటి తనుఁగప్పిన
చేరువవెలుఁగై తోఁపెడిచెలి యికఁ నెవ్వఁడొకో

చ.2:
దురితపుకాననములలో త్రోవటు దప్పినవారికి
తెరు విదె కొమ్మని చూపెడిదేవుఁడి దెవ్వఁడొకో
పెరిగిన యాశాపాశము పెడగేలుగఁ దనుఁగట్టిన
వెరవకుమని విడిపించేటి విభుఁడిఁక నెవ్వఁడొకో

చ.3
తగిలిన యాపదలనియెడి దావానలముల చుట్టిన
బెగడకుమని వడినార్సెడి బిరుదిఁక నెవ్వఁడొకో
తెగువయుఁ దెంపును గలిగిన తిరువేంకట విభుఁడొక్కఁడే
సొ గిసి తలంచినవారికి సురతరువగువాఁడు