పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0067-06 సామంతం సం; 01-351 దశావతారములు


పల్లవి:
అందరి కాధారమైనఆదిపురుషుఁ డీతఁడు
విందై మున్నారగించె విదురునికడ నీతఁడు

చ.1:
సనకాదులు గొనియాడెడి సర్వాత్మకుఁ డీతఁడు
వనజ భవాదులకును దైవంబైనతఁ డీతఁడు
యినమండలమునఁ జెలఁగేటిహితవైభవుఁ డీతఁడు
మునువుట్టిన దేవతలకు మూలభూతి యీతఁడు

చ.2:
సిరులొసఁగి యశోదయింట శిశువైనతఁ డీతఁడు
థరనావులమందలలో తగఁ జరించె నీతఁడు
సరసతలను గొల్లెతలకుఁ జనవులొసఁగె నీతఁడు
ఆరసి కుచేలునియడుకు లారగించె నీతఁడు

చ.3:
పంకజభవునకును బ్రహ్మపద మొసఁగెను యీతఁడు
సంకీర్తన లాద్యులచే జట్టిగొనియె నీతఁడు
తెంకిగ నేకాలముఁ బరదేవుఁడయిన యీతఁడు
వేంకటగిరిమీఁద బ్రభల వెలసినఘనుఁ డీతఁడు