పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0067-05 పాడి సం: 01-350 వైరాగ్య చింత


పల్లవి:
కటకటా జీవుఁడా కాలముదోలుకరాఁగ
సటవటలనే పొద్దు జరుపే వుగా

చ.1:
సమత నన్నియును జదివి కడపటను
కుమతివై అందరిఁ గొలిచేవుగా
తమిగొని ప్రేమ నెంతయును గంగకుఁబోయి
తమకింది నూతినీరు దాగేవుగా

చ.2:
తనువుఁ బ్రాయము నమ్మి దానధర్మము మాని
చెనటివై కర్మాలు సేసేవుగా
వొనరఁగ మీఁదనా డైన యొగులు నమ్మి
దొనలనీళ్ళు వెళ్ళఁదోసే వుగా

చ.3:
యెలమితోఁ దిరువేంకటేశుఁ గొలువలేక
పొలము రాజులవెంటఁ బొయ్యేవుగా
చిలుకకువలె బుద్ధిచెప్పనఁ గానలేక
పలువమారుకే తోజుఁ బాడేవుగా