పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0064-01 వరాళి సం: 01-328 వైరాగ్య చింత


పల్లవి:
ఏమి గలదిందు నెంత పెనగినఁ వృధా
కాముకపు మనసునకు కడ మొదలు లేదు

చ.1:
వత్తిలోపలి నూనె వంటిది జీవనము
విత్తుమీదటి పొల్లు విధము దేహంబు
బత్తిసేయుట యేమి పాసిపోవుట యేమి
పాత్తుల సుఖంబులకు పారలుటలుగాక

చ.2:
ఆకాశ పాకాశ మరుదైన కూటంబు
లోకరంజకము తమలోనిసమ్మతము
చాకిమణుఁగుల జాడ చంచలపు సంపదలు
చేకొనిననేమి యివి చెదిరిననునేమి

చ.3:
గాదెఁబోసినకొలుచుకర్మి సంసారంబు
వేదు విడువనికూడు వెడమాయబదుకు
వేదనల నెడతెగుట వేంకటేశ్వరు కృపా-
మోదంబు వడసినను మోక్షంబు గనుట