పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0063-06 దేశి సం: 01-327 అధ్యాత్మ


పల్లవి:
జీవుఁ డెంతటివాఁడు చిత్త మెంతటిది తన
దైవికము గడవ నెంతటివాఁడు దాను

చ.1:
విడిచిపోవని యాస విజ్ఞానవాసనలఁ
గడచి మున్నాడె నెక్కడివివేకములు
వుడుగనియ్యనిమోహ ముబ్బి పరమార్ధముల
మెడవట్టి నూకె నేమిటికింక నెరుక

చ.2:
పాయనియ్యనిమహాబంధ మధ్యాత్మతో
రాయడికిఁ దొడఁగె సైరణలేల కలుగు
మాయనియ్యనికోపమహిమ కరుణామతిని
వాయెత్తనియ్య దెవ్వరికిఁ జెప్పుదము

చ.3:
సరిలేనియాత్మచంచల మంతరాత్మకుని-
నెరఁగనియ్యదు దనకు నేఁట్టిపరిణతలు
తి రువేంకటాచలాధిపునిమన్ననఁగాని
వెరసి యిన్నటి గెలువ వెరవు మఱిలేదు