పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0063-05 శ్రీరాగం సం: 01-326 భక్తీ


పల్లవి:
కాకున్న సంసారగతులేల
లోకకంటకములగు లోభంబులేల

చ.1:
వినికిగనవలసినను విష్ణుకీర్తన చెవికి
వినికివేసిన నదియె వేదాంతబోధ
మనికిగనవలసినను మధువైరిపై భక్తి
వునికి ప్రాణులకు బ్రహ్మోపదేశంబు

చ.2:
చదువు గనవలసినను శౌరినామము దిరుగఁ
జదువుటే సకలశాస్త్రముల సమ్మతము
నిదుర గనవలసినను నీరజాక్షునికిఁ దన-
హృదయసమర్పణ సేయుటిది యోగనిదుర

చ.3
ఆస వలసిన వేంకటాధీశ్వరుని కృపకు-
నాససేయుటే పరమానందసుఖము
వాసి గనవలసినను వైష్ణవాగారంబు
వాసి సేయుట తనకు వైభవస్ఫురణ