పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0043-02 సామంతం సం: 01-262 భక్తీ


పల్లవి: నారాయణ నీనాముము బుద్ధిఁ
        జేరినాఁ జాలు సిరులేమి బాఁతి

చ.1: ననుపైన శ్రీవిష్ణునామము పేరు-
      కొనఁగానే తేఁకువ మీరఁగా
      ఘనమైన పుణ్యాలు గలుగఁగా తమ-
      కనయముఁ బరమది యేమిబాఁతి

చ.2: నలువైన శ్రీహరినామము మతిఁ
      దలఁచిననాబంధము లూడఁగా
      యెలమి దీనిఁ బఠియించినా యీ-
      కలుషములేల కలుగు నెవ్వరికి

చ.3: వేంకటపతి నామవిభవము కర్మ
       పంకములెల్లఁ బరిమార్చఁగా
       బింకమై తలఁపెడి ప్రియులకుఁ యెందు-
       నింక నీ సుఖమిది యేమిబ్రాఁతి