పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0043-01 థన్నాశి సం: 01-261 కృస్ణ


పల్లవి:ఆదిమునుల సిద్ధాంజనము
       యేదెసఁ జూచిన నిదివో వీఁడే

చ.1: నగిన సెలవిఁ బడు నాలుగుజగములు
      మొగమునఁ జూపే మోహనము
      నిగిడి యశోదకు నిధానంబై
      పొగడొందీ గృహమున నిదె వీఁడే

చ.2: కనుదెరచిన నలుగడ నమృతము లటు
      అనువునఁ గురసీ నపారము
      వనితలు నందవ్రజమునఁ జెలఁగఁగ
      మనికికి నిరవై మలసీ వీఁడే

చ.3: పరమునకునుఁ దాఁ బరమై వెలసిన-
      పరిపూర్ణ పరాత్పరుఁడు
      సరుస రుక్మిణికి సత్యభామకును
      వరుఁడగు వేంకటవరదుఁడు వీఁడే