పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0041-03 ముఖారి సం; 01-251 అధ్యాత్మ


పల్లవి:కడునడసు చొరనేల కాళ్ళు గడుగఁగనేల
       కడలేని జన్మసాగర మీఁదనేల

చ.1:దురితంబునకు నెల్లదొడవు మమకారంబు_
      లరిదిమమతలకుఁ దొడ వడియాసలు
      గురుతయిన యాసలకుఁ గోరికలు జీవనము
      పరగ నిన్నిటికి లంపటమె కారణము

చ.2:తుదలేని లంపటము దుఃఖహేతువు దుఃఖ
      ముదుటయిన తాపమున కుండఁగఁ జోటు
      పదిలమగు తాపంబు ప్రాణసంకటము లీ-
      మదము పెంపునకుఁ దనమనసు కారణము

చ.3:వెలయ దనమనసునకు వేంకటేశుఁడు గర్త
      బలిసి యాతనిఁ దలఁచుపనికిఁ దాఁ గర్త
      తలకొన్న తలఁపు లివి దైెవమానుషముగాఁ
      దలఁచి యాత్మేశ్వరునిఁ దలఁపంగ వలదా