పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0037-02 ముఖారి సం: 01-228 భక్తి


పల్లవి:సిరి దొలంకెడి పగలు చీఁక టా యితఁడేమి
       యిరవు దెలిసియుఁ దెలియనియ్యఁడటుగాన

చ.1: తలపోయ హరినీలదర్పణంబో ఇతఁడు
      వెలుఁగుచున్నాడు బహువిభవములతోడ
      కలగుణం బటువలెనె కాఁబోలు లోకంబు
      గలదెల్ల వెలిలోనఁ గనిపించుఁ గాన

చ.2: మేరమీరిననీలమేఘమో యితఁడేమి
      భూరిసంపదలతోఁ బొలయుచున్నాడు
      కారుణ్యనిధియట్ల కాఁబోలు ప్రాణులకు
      కోరికలు దలఁపులోఁ గురియు నటుగాన

చ.3: తనివోనిఆకాశతత్వమో యితఁడేమి
      అనఘుఁడీ తిరువేంకటాద్రి వల్లభుఁడు
      ఘనమూర్తి అటువలెనె కాఁబోలు సకలంబు
      తనయందె యణఁగి యుద్బవమందుఁగాన