పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0037-03 ఆహిరి సం: 01-229 అథ్యాత్మ


పల్లవి: తనవారలు పెరవారలుఁ దానని యెడివాఁ డెవ్వఁడు
       తనుగుణముల దిగవిడిచినధన్యుం డాతఁడెపో

చ.1: తెగఁబడి మదనసముద్రము దేహముతోడనె దాఁటిన
      విగతభయుం డతఁ డెవ్వఁడు వీరుం డెవ్వఁడొకో
      పగగొని పంచేంద్రియముల ప్రాణముతోడనె బతికి
      జగదేకప్రీతుండగుచతురుం డాతఁడెపో

చ.2: యేచినపరితాపాగ్నుల నేమియు నొవ్వక వెడలిన
      ధీచతురుం డతఁడెవ్వండు ధీరుం డెవ్వఁడొకో
      చూచిన మోహపుఁజూపులఁ జురుచూండ్ల కెడమియ్యని
      రాచఱికపు నెరజాణఁడు రసికుం డాతఁడెపో

చ.3: చావుకు సరియగు ద్రవ్యవిచారపు తుగులులఁ బాసిన
      పావనుఁ డెవ్వఁడు బహుజనబాంధవుఁ డెవ్వఁడొకో
      శ్రీవేంకటగిరినాథుని చిత్తములోపల నిలిపిన -
      దేవసమానుఁడు నాతఁడె ధీరుఁడు నాతఁడెపో