పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0029-03 కన్నడగౌళ సం: 01-178 వైరాగ్య చింత


పల్లవి:

 కటకటా దేహంబు గాసిఁబెట్టఁగ వలనె
నిటువంటి దెసలచే నిట్లుండవలనె


చ. 1:

 చంపనొల్లక కదా సంసారమనియెడి-
గంపమోఁపు గడించె కర్మసంగ్రహము
లంపటము విరియించ లావుచాలక తుదిని
దింప నొకకొంతైన తెగుదెంపులేదు


చ. 2:

 మనుపనోపకకదా మాయవిలంబమున
కనుమూసి కాంక్ష మఱి కట్టె దైవంబు
దినభోగములు విడువఁ దెఱఁ గేమిటను లేక
తనివిఁబొందించ నెంతయు వసముగాదు


చ. 3:

 తెలుపనోపకకదా తిరువేంకటేశ్వరుఁడు
వెలలేనివేదనల వేఁచెఁ బ్రాణులను
బలిమి నజ్ఞానంబుఁ బాయలే కితనినే
తలఁచి భవబంధముల దాఁటంగరాదు