పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0029-04 సామంతం సం: 01-179 వైరాగ్య చింత


పల్లవి:

అయ్యోపోయఁ బ్రాయముఁ గాలము
ముయ్యంచు మనసున నే మోహమతినైతి


చ. 1:

 చుట్టంబులా తనకు సుతులుఁ గాంతలుఁ జెలులు
వట్టి యాసలఁ బెట్టువారే కాక
నెట్టుకొని వీరు గడు నిజమనుచు హరి నాత్మఁ
బెట్టనేరక వృధా పిరివీకులైతి


చ. 2:

 తగుబంధులా తనకుఁ దల్లులునుఁ దండ్రులును
వగలఁ బెట్టుచుఁ దిరుగువారే కాక
మిగుల వీరలపొందు మేలనుచు హరినాత్మఁ
దగిలించ లేక చింతాపరుఁడనైతి


చ. 3:

 అంత హితులా తనకు నన్నలునుఁ దమ్ములును
వంతువాసికిఁ బెసఁగువారే కాక
అంతరాత్ముఁడు శ్రీవేంకటాద్రీశుఁ గొలువ కిటు
సంత కూటముల యలజడికి లోనైతి