పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0029-02 కాంబోది సం: 01-177 వైరాగ్య చింత


పల్లవి:

 గడ్డపార మింగితే నాఁకలి దీరీనా యీ-
వొడ్డినభవము దన్ను వోడ కమ్ముఁగాక


చ. 1:

 చించుక మిన్నులఁ బారేచింకలను బండిఁ గట్టి
వంచుకొనేమన్న నవి వసమయ్యీనా
యెంచరాని యింద్రియము లెవ్వెరికి నేల చిక్కు
పొంచి పొంచి వలపులు బొండఁబెట్టుఁగాక


చ. 2:

 మంటమండేయగ్గి దెచ్చి మసిపాఁత మూఁటగట్టి
యింటిలోన దాఁచుకొన్న నితవయ్యీనా
దంటమమకార మిట్టే తన్నునేల సాగనిచ్చు
బంటుఁజేసి ఆసలనే పారఁదోసుఁగాక


చ. 3:

 పట్టరాని విషములపాముఁ దెచ్చి తలకిందఁ
బెట్టుకొన్నా నది మందపిలి వుండీనా
వెట్టసంసార మిది వేంకటేశుఁ గొలువని-
వట్టిమనుజుల పెడవాడఁబెట్టుఁగాక