పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0028-03 సామంతం సం: 01-171 కృష్ణ


పల్లవి:

 ఎన్నఁగలుగు భూతకోటి నెల్లఁ జేసినట్టిచేఁత
నిన్నుఁ జేసుకొనుటగాక నీకుఁ నీకుఁ దొలఁగవచ్చునా


చ. 1:

 గుట్టుచెరిచి లోకమెల్ల ఘోరసంసారమందు
కట్టివేసినట్టి పాపకర్మ మేల తీరును
పట్టితెచ్చి నిన్ను రోలఁగట్టివేసి లోకమెఱఁగ
రట్టుసేసుఁగాక నిన్ను రాజనన్న విడుచునా


చ. 2:

 మిఱ్ఱుపల్లములకుఁ దెచ్చి మెరసి భూతజాలములకుఁ
దొఱ్ఱపెసలు గొలచినట్టి దోసమేల పాయును
అఱ్ఱుసాఁచి గోపసతుల నలమి వెంటవెంటఁదిరుగ
వెఱ్ఱిఁ జేయుఁగాక నీవు విభుఁడనన్న విడుచునా


చ. 3:

 పరులఇంటి కేఁగి పరులపరుల వేఁడఁజేసినట్టి-
యెరుకమాలినట్టి చేఁత లేల నిన్ను విడుచును
వెరపుమిగిలి వేంకటాద్రివిభుఁడ ననుచు జనులచేత-
నరులుగొనఁగఁ జేయుఁగాక ఆస నిన్ను విడుచునా