పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0028-04 బౌళి సం: 01-172 వేంకటగానం


పల్లవి:

 ఏమివలసిన నిచ్చు నెప్పుడైననే
యేమరిక కొలిచిన నీతఁడే దైవము


చ. 1:

 ఘనముగా నిందరికిఁ గన్నులిచ్చుఁ గాళ్లిచ్చు
పనిసేయఁ జేతులిచ్చు బలియుఁడై
తనుఁగొలువుమని చిత్తములిచ్చుఁ గరుణించి
వొనర లోకానకెల్ల నొక్కఁడే దైవము


చ. 2:

 మచ్చిక తనుఁగొలువ మనసిచ్చు మాటలిచ్చు
కుచ్చితములేని కొడుకుల నిచ్చును
చొచ్చినచోటే చొచ్చి శుభమిచ్చు సుఖమిచ్చు
నిచ్చలు లోకానకెల్ల నిజమైన దైవము


చ. 3:

 పంతమాడి కొలిచినఁ బ్రాణమిచ్చు ప్రాయమిచ్చు
యెంతటి పదవులలైన నిట్టె యిచ్చు
వింతవింత విభవాల వేంకటేశుఁడిదె మా-
యంతరంగముననుండే అరచేతి దైవము