పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0028-02 శ్రీరాగం సం: 01-170 వేంకటగానం


పల్లవి :

ఈతఁడఖిలంబునకు నీశ్వరుఁడై సకల-
భూతములలోనఁ దాఁబొదలు వాఁడితఁడు


చ. 1:

గోపాంగనల మెఱుఁగు గుబ్బచన్నులమీఁద
చూపట్టుకమ్మఁ గస్తూరిపూఁత యితఁడు
తాపసోత్తముల చింతాసౌధములలోన
దీపించు సుజ్ఞానదీప మితఁడు


చ. 2:

జలధికన్యాపాంగ లలితేక్షణములలో
కలసి వెలుఁగుచు నున్న కజ్జలం బితఁడు
జలజాసనుని వదన జలదిమద్యము నందు
అలర వెలువడిన పరమామృతం బితఁడు


చ. 3:

పరివోని సురత సంపదల నింపులచేత
వరవధూతతికి పరమమైన యితఁడు
తిరువేంకటాచలాధిపుఁడు దానె యుండి
పరిపాలనము సేయ భారకుండితఁడు