పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0003-01 కన్నడ గౌళ సం: 01-014 అధ్యాత్మ
పల్లవి: గాలినే పోయఁ గలకాలము
తాలిమికిఁ గొంతయుఁ బొద్దు లేదు
చ. 1: అడుసు చొరనే పట్టె నటునిటుఁ గాళ్ళు
గడుగుకొననే పట్టెఁ గలకాలము
ఒడలికి జీవుని కొడయఁడైనహరిఁ
దడవఁగా గొంతయుఁ బొద్దులేదు
చ. 2: కలఁచి చిందనే పట్టెఁ గడవ నించగఁ బట్టె
కలుషదేహపుబాదఁ గలకాలము
తలపోసి తనపాలిదైవమైనహరి
దలఁచఁగా గొంతయుఁ బొద్దులేదు
చ. 3: శిరసు ముడువఁబట్టె చిక్కుదియ్యఁగఁ బట్టె
గరిమలఁ గపటాలఁ గలకాలము
తిరువేంకటగిరి దేవుఁడైన హరి
దరిచేరాఁ గొంతయుఁ బొద్దు లేదు