పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0003-02 వరాళి సం: 01-015 అధ్యాత్మ
పల్లవి: ఎవ్వారులేరూ హితవు చెప్పఁగ వట్టి-
నొవ్వులఁ బడి నేము నొగిలేమయ్యా
చ. 1: అడవిఁ బడినవాఁడు వెడలఁ జోటులేక
తొడరి కంపలకిందు దూరినట్లు
నడుమ దురితకాననములతరిఁ బడి
వెడలలేక నేము విసిగేమయ్యా
చ. 2: తెవులువడినవాఁడు తినఁబోయి మధురము
చవిగాక పులుసులు చవిగోరినట్లు
భవరోగములఁ బడి పరమామృతము నోరఁ
జవిగాక భవముల చవులాయనయ్యా
చ. 3: తనవారి విడిచి యితరమైనవారి-
వెనకఁ దిరిగి తా వెఱ్ఱైనట్లు
అనయము తిరువేంకటాధీశుఁ గొలువక
మనసులోని వాని మఱచేమయ్యా