పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0002-07 శంకరాభరణం సం: 01-013 నృసింహ
పల్లవి: మలసీఁ జూడరో మగ సింహము
అలని మీఱిన మాయల సింహము
చ. 1: అదివో చూడరో ఆదిమపురుషుని
పెదయౌభళము మీఁది పెనుసింహము
వెదకి బ్రహ్మాదులు వేదాంతతతులు
కదిసి కానఁగలేని ఘనసింహము
చ. 2: మెచ్చిమెచ్చి చూడరో మితిమీఱినయట్టి-
చిచ్చిఱకంటితోడి జిగిసింహము
తచ్చినవారిధిలోన తరుణిఁ గౌఁగిటఁ జేర్చి
నచ్చినగోళ్ళ శ్రీనరసింహము
చ. 3: బింకమునఁ జూడరో పిరితియ్యక నేఁడు
అంకపుదనుజసంహారసింహము
వేంకటనగముపై వేదాచలముపై
కింక లేక వడిఁ బెరిగినసింహము