పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0021-03 సామంతం సం: 01-127 వేంకటగానం


పల్లవి :

ఆదిదేవుఁడై అందరిపాలిటి
కీ దేవుఁడై వచ్చె నితఁడు


చ. 1:

కోరిన పరమ యోగుల చిత్తములలోన
యేరీతి నుండెనో యీతఁడు
చేరవచ్చిన యాశ్రితులనెల్లఁ బ్రోవ
యీరీతి నున్న వాఁడీతడు


చ. 2:

కుటిల దానవుల కోటానఁగోట్ల
యెటువలెఁ ద్రుంచెనో యీతఁడు
ఘటియించి యిటువంటి కారుణ్యరూపుఁడై
యిటువలె నున్న వాఁడీతడు


చ. 3:

తక్కక్క బ్రహ్మాండ తతులెల్ల మోచితా-
నెక్కడ నుండెనో యీతఁడు
దిక్కుల వెలసిన తిరువేంకటేశుఁడై
యిక్కడ నున్న వాఁడీతఁడు