పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0021-04 గుండక్రియ సం: 01-128 దశావతారములు


పల్లవి :

తానే తెలియవలె తలఁచి దేహి తన్ను
మానుపువారలు మరి వేరీ


చ. 1:

కడలేని భవసాగరము చొచ్చినతన్ను
వెడలించువారలు వేరీ
కడుబందములచేతఁ గట్టుపడిన తన్ను
విడిపించువారలు వేరీ


చ. 2:

కాఁగినినుము వంటికర్మపు తలమోపు -
వేఁగు దించేటివారు వేరీ
మూఁగిన మోహపుమూఁకలు తొడిఁబడ
వీఁగఁ దోలేటివారలు వేరీ


చ. 3:

తిరువేంకటాచలాధిపునిఁ గొలుపుమని
వెరపు చెప్పెడువారు వేరీ
పరివోని దురితకూపములఁ బడకుమని
వెరపు చెప్పెడివారు వేరీ