పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0021-02 శ్రీరాగం సం: 01-126 కృష్ణ


పల్లవి :

ఇతఁడు చేసిననేఁత లెన్నిలేవిలమీఁద
యితఁడు జగదేకగర్వితుఁడౌనో కాఁడో


చ. 1:

కుడువఁడా ప్రాణములుగొనుచుఁ బూతకిచన్ను
తుడువఁడా కపటదైత్యులనొసలి వ్రాలు
అడువఁడా నేలతో నలమి శకటాసురుని
వడువఁడా నెత్తురులు వసుధ కంసునివి


చ. 2:

పెట్టఁడా దనుజారిబిరుదు లోకమునందు
కట్టఁడా బలిదైత్యు కర్మబంధముల
మెట్టఁడా కాళింగు మేటిశిరములు, నలియఁ-
గొట్టఁడా దానవులఁ గోటానఁగోట్ల


చ. 3:

మరపఁడా పుట్టువులు మరణములుఁ బ్రాణులకు
పరపఁడా గంగఁ దనపాదకమలమున
చెరుపఁడా దురితములు శ్రీ వెంకటేశుఁడిదె
నెరపఁడా లోకములనిండఁ దనకీర్తి