పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0021-01 ఆహిరి సం: 01-125 దశావతారములు


పల్లవి :

పెక్కులంపటాల మనసు పేదవైతివి నీకు
నెక్కడా నెవ్వరులేరు యేమిసేతువయ్యా


చ. 1:

కన్నుమూయఁ బొద్దులేదు, కాలు చాఁచ నిమ్ములేదు
మన్నుదవ్వి కిందనైన మనికి లేదు
మున్నిటివలెనే గోరుమోపనైనఁ జోటు లేదు
యిన్నిటా నిట్లానైతి వేమి సేతువయ్యా


చ. 2:

అడుగిడఁగ నవ్వల లేదు, అండనైన నుండలేదు
పుడమిఁ గూడు గుడువనైనఁ బొద్దులేదు
వెడఁగుఁదనము విడువలేదు, వేదమైనఁ జదువలేదు
యెడపఁదడప నిట్ల నీకు నేమిసేతువయ్యా


చ. 3:

వుప్పరములు మానియైన నుండలేదు లోకమందు
నిప్పుడైన నీవిహర మిట్ల నాయను
చెప్పనరుదు నీగుణాలు శ్రీవేంకటేశ యిట్ల-
నెప్పుడును ఘనుఁడ వరయ నేమిసేతువయ్యా