పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0017-01 ఆహిరి సం: 01-101 భక్తి


పల్లవి:

ఏఁటికి దలఁకెద రిందరును
గాఁటపు సిరులివి కానరో ప్రజలు


చ. 1:

ఎండలఁ బొరలక యేచిన చలిలో
నుండక చరిలోనుడుకక
అండనున్న హరి నాత్మఁదలఁచిన
పండిన పసిఁడే బ్రతుకరో ప్రజలు


చ. 2:

అడవుల నలియక ఆకునలముఁదిని
కడుపులు గాలఁగఁ గరఁగక
బడి బడి లక్ష్మిపతికి దాసులై
పొడవగు పదవులఁ బొందరో ప్రజలు


చ. 3:

పొక్కేటికాళ్ళ పుండ్లు రేఁగఁగ
దిక్కులనంతటఁ దిరుగక
గక్కన తిరువేంకటగిరిపతిఁ గని
వొక్క మనసుతో నుండరొ ప్రజలు