పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0017-02 బౌళి సం: 01-102 వైరాగ్య చింత


పల్లవి :

ఏది తుద దీనికేది మొదలు
పాదుకొను హరి మాయఁ బరగు జీవునికి


చ. 1:

ఎన్ని బాధలు దనకు నెన్ని లంపటములు
యెన్ని వేదనలు మరియెన్ని దుఃఖములు
యెన్ని పరితాపంబు లెన్నిదలపోఁతలు
యెన్ని చూచిన మరియు నెన్నైనఁ గలవు


చ. 2:

యెన్ని కొలువులు దనకు నెన్ని యనుచరణలు
యెన్ని యాసలు మరియు నెన్ని మోహములు
యెన్ని గర్వములు దనకెన్ని దైన్యంబులివి
ఇన్నియునుఁ దలఁప మరి యెన్నైనఁ గలవు


చ. 3:

యెన్నిటికిఁ జింతించు నెన్నిటికి హర్షించు
నెన్నిటికి నాసించు నెన్నిటికిఁ దిరుగు
యిన్నియును దిరు వేంకటేశులీలలు గాఁగ
నెన్ని చూచినను దా నెవ్వఁడునుగాఁడు