పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

iii) వేదాంత, యోగ విశేషాలు : ఈ శతకం ప్రధానంగా భక్తిశతకమే అయినప్పటికీ, ఇందులో ఇంచుమించు 40 పద్యాల్లో జీవుడు, ఆత్మ, పరమాత్మ, సద్గురు మహిమ - మొదలైన పెక్కు తాత్త్విక విషయాలు ప్రవచింపబడివున్నాయి. ఈ వేదాంత, యోగ విశేషాల ప్రాశస్త్యాన్నిబట్టే కొందరు విమర్శకులు ఈ కృతిని వేదాంత శతకాల శ్రేణికి చెందిందిగా పరిగణించారు.

iv) కవయిత్రి ఆత్మీయాంశ: వెంగమాంబ ఆత్మీయాంశ ఈ రచనలో అద్దంలాగా సుస్పష్టరేఖలతో ప్రతిబింబించివుంది. ఈమె పద్య రచన ప్రారంభించిన తొలినాళ్లలోనే ఈమెది 'వికల్పకవిత' అనే విమర్శ బయలు దేరిందట! (చూ.4ప.). 'వికల్ప కవిత్వం' అనగా 'కవిత్వం కాకపోయినా కవిత్వంలాగా కనిపించే రచన'- అని అభిప్రాయం. కాని, పై విమర్శ అసూయతో గూడిన పసలేని విమర్శ అనటానికి ఈ శతకమే సాక్ష్యం. ఈప్రథమరచననాటికే ఈ కవయిత్రి వివాహితయని, భర్తపేరు ఇంజేటి వేంకటా చలపతి యని ఇందలి చివరిపద్యం ప్రకటిస్తూవుంది.

ఇంతేగాక, గురువర్యుడు పాదమూలంచేత తన (శిష్యురాలి) నుదుటివ్రాతను మార్చివేసినట్లు ఈ కవయిత్రి 41వ పద్యంలో పేర్కొనియున్నది. అందువల్ల, ఆ గురువు ఆధ్యాత్మికోపదేశంచేత ఈ కవయిత్రి జీవితానికి నూతనోత్తేజాన్ని ప్రసాదించినాడనే అర్థం సూచింపబడింది.

ఈ శతకరచనాకాలం నాటికే వెంగమాంబ ఇలవేల్పైన తరిగొండ లక్ష్మీనృసింహస్వామియొక్క పరిపూర్ణ కటాక్షానికి పాత్రురాలై యున్నట్లు ఈ శతకంలోని 32, 42, 86, 102 సంఖ్యలు గల పద్యాలు స్పష్టంగా చాటుతూవున్నాయి.