పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. రచనోద్దేశం:

స్వగ్రామమైన తరిగొండలో వెలసి, తనకు ఇలవేల్పైయున్న శ్రీలక్ష్మీనృసింహస్వామివారి యెడల తనకు గల భక్తి ప్రపత్తులను అక్షరరూపేణ వెల్లడించు పూనికతోను, తన రచనా వ్యాసంగానికి ఆది ప్రయత్నంగాను వెంగమాంబ రచించిన శతక మిది. ఈ శతకంలోని "అతులితమైన మీపదవి నందందలంచి విశాలభక్తిచే"- ఇత్యాది మూడవ పద్యంద్వారా కవయిత్రి తనకు గల పరమోద్దేశాన్ని (అతులితమైన పదవిని - అనగా మోక్షాన్ని పొందాలనే ఆకాంక్షను) స్పష్టంగా వెల్లడించింది. నిజానికి 'ముక్తికాంక్ష'- అనే ఈ పరమలక్ష్యాన్ని ఉద్దేశించియే తరువాతి కాలంలో ఈమె సారస్వతమంతా వెల్లివిరిసింది. ఆ ధ్యేయం ఇలాగ ఆమె తొలిరచనలోనే వ్యక్తంకావడం ఒక విశేషం!

4. ప్రతిపాదించిన విషయాలు:

ఈ కృతిలో ఆ యా పద్యాల మూలంగా ప్రబోధింపబడిన విషయాలను బట్టి ఇందులో i) భక్తి ii) నీతి iii) వేదాంత, యోగ విశేషాలు iv) కవయిత్రి ఆత్మీయాంశ- అనేవి ప్రధానంగా ప్రతిపాదింపబడినవని గుర్తింపవచ్చు.

i) భక్తి: వెంగమాంబ 'అచ్చపుభక్తి'కి ఉదాహరింపదగిన పద్యాలు ఈ శతకంలో అనేకం ఉన్నాయి. వాటిలో 'దశావతారస్తుతి'- ఒక ఘట్టం. (చూ.7 నుండి 16 వరకు గల పది పద్యాలు). ఈ కవయిత్రి భక్తిలో కొన్నిచోట్ల మధురభక్తి (నాయికాభావన) కూడ గోచరిస్తూవుంది. (చూ. 17,19,20,21 పద్యాలు).

ii) నీతి : వెంగమ లేఖినినుండి అలవోకగా వెలువడి, మిగుల సహజంగా భాసిస్తూవున్న నీతిపద్యాలు ఇందులో అచ్చటచ్చట నెలకొని వున్నాయి. మచ్చుకు 92, 95 సంఖ్యలుగల పద్యాలు తిలకింపదగివున్నాయి.