పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

1. రచనా ప్రక్రియ:

తెనుగు సాహిత్యంలో 'శతక'మనే రచనాప్రక్రియ ఎంత ప్రాచీనమైనదో, అంత నవీనమైనది. శతకానికి ముఖ్య లక్షణాలు మూడు: i) మకుటం - అంటే రచయిత ఇష్టదైవాన్ని ఉద్దేశించిన సంబోధన ii) పద్యసంఖ్య- అనగా 'శతక'మనే పేరుకు అనుగుణంగా నూరు పద్యాలకు తక్కువ కాకుండా ఉండటం. iii) ఛందస్సు - అంటే శతకంలోని పద్యాలు మొదటి నుండి చివరి వరకు ఒకే ఛందంలో రచింపబడివుండటం.

పై మూడూ సామాన్యంగా తెలుగు శతకానికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు.

తెలుగు శతకాల్లో భక్తి శతకాలది అన్ని విధాల అగ్రస్థానం. తెనుగులో అసంఖ్యాకంగా వెలువడిన భక్తిశతక సముదాయంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచించిన “తరిగొండ నృసింహశతకము" విశిష్టమైనది. ఇది ఈ భక్తకవయిత్రి రచనల్లో మొట్టమొదటిది. ఆమె తరిగొండలో ఉండినప్పుడు రచించినది.

2. శతక స్వరూపం:

వెంగమాంబ లేఖినినుండి ప్రప్రథమకృతిగా అవతరించిన ఈశతకంలో నూటమూడు పద్యాలు ఉన్నాయి. అందులో 65 ఉత్పలమాలలు, 38 చంపకమాలలు కలవు. "తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!" - అనేది ఇందలి 'మకుటం'. ఈ మకుటాన్ని బట్టే ఈ కృతికి "తరిగొండ నృసింహశతక”మనే నామధేయం ఏర్పడింది.