పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

నరహరి! మ్రొక్కి చెప్పెదను నా నుదుటన్ గల వ్రాలు ప్రేమతో
నరుదుగ నంఘ్రిమూలమున నంటెను, పూర్వపువ్రాలు దీసి, యా
సరసిజగర్భుపట్టమున సాంద్రకటాక్షము నుండఁ బంచె; మ
ద్గురు[1]మహిమేమనందుఁ? దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

41

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! ఓ నరహరీ! ఇప్పుడు తమకు ఒకానొక స్వానుభవాన్ని మనవి చేస్తున్నాను; కృపతో చిత్తగించు! గురువర్యుడు నాపై గల అవ్యాజమైన ప్రేమతో, తన పాదంచేత నా నొసటి యందలి బ్రహ్మవ్రాతను (బ్రహ్మలిపిని) తుడిచివేసి, క్రొత్తగా అనుగ్రహపూర్వకమైన తన వ్రాతను వ్రాసి, నన్ను చరితార్థురాలిని కావించియున్నాడు. ఈ విధంగా నా జీవితంయొక్క భవిష్యత్తునే మార్చివేసిన మదీయ సద్గురువర్యుని మాహాత్మ్యాన్ని ఏమని కొనియాడగలను? (అటువంటి గురుపుంగవుని ప్రభావాన్ని ప్రశంసింపజాలనని కవయిత్రియొక్క అభిప్రాయం.)

సూచన: ఈ కవయిత్రీమతల్లి యొక్క అపూర్వమైన ఆధ్యాత్మికానుభూతులలో ఇది యొకటిగా పేర్కొనదగియున్నది.

  1. 'మహిమ+ఏమని+అందున్' అని పదవిభాగము