పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

దేశములోన దివ్యమగు ధీరుఁడు సర్వము నిండియుండఁగా
వాసి గనంగలేక, మనవారును, నన్యులటంచు నుండి, [1]
ట్టాస లనేటి తీఁగెలను నప్పుడు [2]నిశ్చయమంచు కత్తితోఁ
గోసెను మద్గురుండు, తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

40

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! లోకంలో భగవంతుడనే ధీరాగ్రేసరుడు అంతటా వ్యాపించి యుండగా, ప్రసిద్ధమైన ఈ సత్యాన్ని తెలిసికోలేక, 'వీళ్లు మనవాళ్లు, వాళ్లు పరాయివాళ్ళు'- అనేటటువంటి భేదభావంతో ఉంటూవుండినాను. అప్పుడు నా గురువర్యుడు నాలోని పలురకాల వ్యర్థమైన ఆశలనే తీగలను దృఢనిశ్చయమనెడి పదునైన అంచుగల కత్తితో మొదలంట కోసివైచి, నాకు అభేదభావపూర్వకమైన జ్ఞానోదయాన్ని ప్రసాదించాడు కదా!

  1. ‘వట్టి+ఆసలు+అనేటి”– అని పదవిభాగము
  2. ‘నిశ్చయము+అంచుకత్తితోన్'- అని పదవిభాగము