పుట:జనన మరణముల రిజిస్ట్రీకరణ చట్టము, 1969.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జనన మరణముల రిజిస్ట్రీకరణ చట్టము, 1969.

(1969 లోని 18వ చట్టము)

(31 మే, 1969)

జనన మరణముల రిజిస్ట్రీకరణను క్రమబద్ధము చేయుటకు మరియు దానికి సంబంధించిన విషయములను గూర్చి నిబంధనలు చేయుటకైన చట్టము.

భారత గణరాజ్యము యొక్క ఇరువదవ సంవత్సరములో పార్లమెంటుచే ఈ క్రింది విధముగా శాసనము చేయనైననది:—

అధ్యాయము 1.

ప్రారంభిక.

(1) ఈ చట్టమును జనన మరణముల రిజిస్ట్రీకరణ చట్టము, 1969 అని పేర్కొనవచ్చును.

(2) ఇది యావద్భారత దేశమునకు విస్తరించును.

(3) ఇది రాజపత్రములో అధిసూచన ద్వారా, కేంద్ర ప్రభుత్వము నియతము చేయునట్టి తేదీన ఏ రాజ్యములోనైనను అమలులోనికి వచ్చును.[1]

అయితే ఒక రాజ్యములోని వేరు వేరు భాగములకు వేరు వేరు తేదీలు నియతము చేయవచ్చును.

2. (1) ఈ చట్టములో సందర్భమునుబట్టి అర్థము వేరుగా ఉన్ననే తప్ప, -

(ఏ) "జననము" అనగా సజీవ జననము లేక నిర్జీవ జననము అని అర్థము;

(బీ) "మరణము" అనగా సజీవ జననము పిమ్మట ఏ సమయమునన్నెనను జీవ లక్షణములన్నియు శాశ్వతముగా కనిపించకుండ పోవుట అని అర్ధము;

(సీ) "భ్రూణ మరణము" అనగా, గర్భధారణ కాలావధి ఎంతయైనను , తల్లి నుండి పిండమును పూర్తిగా బయట పడగొట్టుటకు లేక బయటికి లాగివేయుటకు పూర్వమే జీవ లక్షణములేవియు దానిలో లేకుండుట అని అర్థము ; .

(డీ) "సజీవ జననము" అనగా, గర్భధారణ కాలావధి ఎంతయైనను , తల్లి నుండి బయటపడిన పిమ్మట లేక బయటికి లాగివేయబడిన పిమ్మట ఊపిరి పీల్చు లేక జీవము ఉన్నట్లు అన్య లక్షణములను కనపరచు పిండము తల్లినుండి బయటపడుట లేక తల్లినుండి లాగివేయబడుట అని అర్థము; మరియు అట్లు జన్మించిన ప్రతి ఉత్పత్తి, సజీవ జనితముగా భావించనగును;

(ఈ) "విహిత" అనగా ఈ చట్టము క్రింద చేసిన నియమముల ద్వారా విహితపరచిన అని అర్థము:

(ఎఫ్) సంఘ రాజ్యక్షేత్రమునకు సంబంధించి "రాజ్య ప్రభుత్వము" అనగా దాని పాలకుడు అని అర్ధము;

(జీ) "నిర్జీవ జననము" అనగా పిండమునకు కనీసము విహిత గర్భకాలావధి నిండినటువంటి భ్రూణ మరణము అని అర్థము.


  1. ఈ చట్టము, ఆంధ్రప్రదేశ్ రాజ్యములో 1-4-1970 తేదీ నుండి అమలులోనికి వచ్చింది. భారత రాజపత్రము II వ భాగము పరిచ్ఛేదము 3 ( 1 ) పేజీ 966లో ప్రచురితమైన 7-3-1970 తేదీగల అధిసూచన నెం - జి - ఎస్. ఆర్. 461 ను చూడండి.