పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

ఇండియా కంపెనీ అధికారులు, జమీందారులు-మహాజనులు ప్రజల మీద సాగిస్తున్న అకృత్యాలను, దోపిడీని స్వయంగా చూశారు. ప్రజల ఆక్రందనలు విన్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం, దోపిడీ శక్తుల అట కట్టించేందుకు నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో శుద్ధ ధార్మిక ప్రచారంతోపాటుగా ప్రాపంచిక సమస్యల పరిష్కారం కోసం, పరాయి పాలకుల పెత్తనాన్ని తుడిచి పెట్టేందుకు టిటూమీర్‌ నడుంకట్టారు.

ఆ దిశగా ఉద్యమించిన టిటూమీర్‌ జమీందారుల దౌర్జన్యాల మీద ధ్వజమెత్తారు. క్రూరులైన జమీందారులకు మద్దతుగా నిలుస్తున్నఆంగ్లేయులను, పోలీసు -సైనిక బలగాలను సాయుధంగా ఎదాుర్కొన్నారు. ఈ మేరకు ప్రజల పక్షంగా పలు పోరాటాలకు ఆయన స్వయంగా నాయకత్వం వహించారు. ఈ కార్యకలాపాల నిర్వహణ కోసం పటిష్టమైన ప్రత్యేక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. పలు ప్రభుత్వ కచ్చేరీల మీద, గడ్డం పన్ను అంటూ ముస్లింలను వేధించిన జమీందారుల ప్రాసాదాల మీద దాడులు జరిపారు. తొలిదశలో ఆచార సాంప్రదాయాలను అవమానపర్చారన్నకసితో జరిగిన దాడులు ఆ తరువాత దిశను మార్చుకున్నాయి. ఈ దాడులలో ఆంగ్లేయ సైన్యాలు, పోలీసు బలగాలు టిటూమీర్‌ అనుచరుల శౌర్యప్రతాపాలు, తెగువ ముందు నిలువలేక పరాజయాన్ని అంగీకరిస్తూ పలుమార్లు పలాయనం చిత్తగించాయి.

ఈ విజయాలతో ఆత్మవిశ్వాసం పెరిగిన టిటూమీర్‌ అనుచరులు ఆంగ్లేయాధి కారులకు తమ దాడుల సమాచారం ముందుగా తెలిపి మరీ వచ్చి ప్రభుత్వ కచ్చేరీల మీద, జమీందారుల మీద దాడులు నిర్వహించారు. ఈ చర్యల మూలంగా మతాలతో సంబంధం లేకుండా అన్ని మతాల, వర్గాల, పేద ప్రజానీకం వేల సంఖ్యలో ఆయన వెంట నడిచారు. ఆ కారణంగా భారీ సంఖ్యలో బలగాలు చేకూరటంతో, కార్యకలాపాలు మరింతగా విస్తరిచటం, శతృవు నుండి ప్రమాదం పొంచి ఉండటంతో, అనుచరులకు ఆశ్రయం కల్పించేందుకు నర్కేల్‌బరియాలో వెదురు కర్రలతో కట్టుదిట్టమైన కోటను నిర్మించుకున్నారు. అక్కడ సహచరులకు సాయుధ శిక్షణ కల్పించి సుమారు దశాబ్దం పాటు ఆంగ్లసైన్యాలను ఎదుర్కొంటూ కంపెనీ పాలకులను ఖంగుతిన్పించారు.

చివరకు 1831 నవంబర్‌ 19న, పోరాట ప్రవీణులుగా ఖ్యాతిగాంచిన ఆంగ్లేయ సైన్యాధికారులు భారీ బలగాలలో, ఆయుధాలతో అన్నివైపుల నుండి నర్కేల్‌బరియాలోని వహాబీల కోటను ముట్టడించగా శతృసైన్యాలతో వీరోచితంగా పోరాడుతూ తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయిన టిటూమీర్‌ చికిత్స పొందుతూ 1832వ సంవత్సరం ఆరంభంలో కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌