పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

189

86. 'కాకా బాబు' ముజఫర్‌ అహమ్మద్‌

(1889-1973)

స్వాతంత్య్రాన్ని సాధించుకోవడం మాత్రమే కాదు అన్నిరకాల అసమానతలు లేని సమాజాన్ని కూడా మనమే నిర్మించుకోవాలన్నసంకల్పంతో ఒకవైపు పరాయిపాలకుల మీద పోరు సాగిస్తూ, మరోవైపు సామ్యవాద వ్యవస్థ నిర్మాణం కోసం పాటుపడిన తొలి తరం నాయకులలో 'కాకాబాబు' గా ఖ్యాతిగాంచిన ముజఫర్‌ అహమ్మద్‌ అగ్రగణ్యులు.

ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని నౌఖాళి జిల్లాలోని సాంద్వీఫ్‌ (SANDWIP) లో 1889 ఆగష్టు 5న ఆయన జన్మించారు. కుటుంబ ఆర్థిక దుస్థితి కారణంగా విద్యాభాసం చేస్తూనే పలు పనులు చేస్తూ ఆయన కుటుంబాన్నిపోషించాల్సి వచ్చింది. కష్టాల కడలిని అతి కష్టంగా ఈదుతున్నా అధ్యయనం పట్ల అమితాసక్తి గల ఆయన ప్రతి పుస్తకాన్ని, పత్రికను వదలకుండా చదవటం ద్వారా మంచి రచయితగానేకాక మంచి వక్తగా రూపొందారు.

చిన్నా చితక ఉద్యోగాలు చేసూ, చాలీచాలని ఆదాయంతో భారంగా బ్రతుకీడుస్తున్న సమయంలో తన చుట్టూ ఉన్నసమాజాన్ని, పలుమార్గాలలో ప్రజల శ్రమను దోచుకుంటున్న శక్తులను, వలస పాలకులు సాగిస్తున్న అదుపులేని దోపిడీని పరికించారు. ఈ పరిస్దితులను మార్చాలని సంకల్పించుకున్నఆయన ప్రభుత్వసేవలో గడపటం ఇష్టం లేక ప్రజలను చైతన్యవంతుల్నిచేసేందుకు రచయితగా ఉపక్రమించారు.

చిరస్మరణీయులు