పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

190

చిన్న వయస్సులోనే ఆయన బెంగాల్‌ విభజనను వ్యతిరేకించారు. ఆ క్రమంలో 1916 నుండి ప్రత్యక్ష రాజకీయాల పట్ల ఆసక్తి కనపర్చటం ప్రారంభించారు. 1917లో రష్యాలో బొల్షివిక్‌ విప్లవం సాధించిన విజయం అయనను ఉత్తేజపర్చింది. ఆ తరువాత రౌలత్‌ చట్టాన్ని నిరసిస్తూ ఉద్యమించారు. బెంగాల్‌లోని విప్లవకారులతో సంబంధాలు పెంచుకున్నారు. ఆ సమయంలో రష్యా నుండి తిరిగి వచ్చిన ముహజరిన్ల ద్వారా కమ్యూనిస్టు సిద్ధాంతాలు పరిచయం కాగా అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యామంతో ఏర్పడిన సంబంధాలతో స్వదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి నడుం కట్టారు. ఆ విధంగా బెంగాల్‌లో కమ్యూనిష్టు ఉద్యమ నిర్మాతగా ముజఫర్‌ అహమ్మద్‌ గణుతికెక్కారు.

1920లో పూర్తిగా రాజకీయాలకు అంకితం కావాలని నిర్ణయించుకున్న ఆయన బెంగాల్‌లో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి నడుం బిగించారు. ఆ నిర్ణయం తరువాత పూట గడవటానికి కూడా ఆయన అనేక ఆర్ధిక ఇబ్బందులు పడ్డారు. కమ్యూనిస్టు ఉద్యామాన్ని మొగ్గలోనే తుంచి వేసేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్ణయించుకుని అందుకు గాను చరిత్రాత్మక 'పెషావర్‌ కుట్ర కేసు' బనాయించి ముజఫర్‌ను నిందితుడ్ని చేసింది.

1924-25 సంవత్సరాలలో ముజఫర్‌ అహమ్మద్‌ తన కార్యక్రమాలను మరింత విస్త్రుతం చేశారు. రచయితగా తనదైన కృషిని సాగిస్తూ, భారత జాతీయ కాంగ్రెస్‌లో పలు బాధ్యతలను నిర్వహించారు. 1926-27లో బెంగాల్‌ ప్రొవెన్షియల్‌ కాంగ్రెస్‌ కమిటీ సభ్యుడిగా చురుకైన పాత్ర నిర్వహించారు. 1927 నుండి 29 వరకు అఖిల భారత కాంగ్రెస్‌ జాతీయ కమిటీ సభ్యునిగా పనిచేశారు. 1939లో ద్వితీయ ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే యుద్ధవ్యతిరేక ప్రదర్శనలలో చురుగ్గా పాల్గొనడంతో ఆయన మీద ప్రభుత్వం నిషేదాజ్ఞలను విధించింది. ఆ తరువాత పలుమార్లు నిర్బంధించింది.1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమంలో కమ్యూనిస్టులు పాల్గొనక పోయినప్పటికి రచయితగా జాతీయోద్యామకారుల పక్షాన ఆయన నిలిచారు.

చిన్నతనం నుండి జాతీయోద్యమకారునిగా ఎదిగి, మరోవైపు కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా వ్యవహరిస్తూ బ్రిటిష్‌ సామ్రాజ్య విస్తరణకాంక్షను, దోపిడిని వ్యతిరేకిస్తూ ఉద్యమించిన కారణంగా ముజఫర్‌ అహమ్మద్‌ పలు కుట్ర కేసులను ఎదుర్కొవడమే కాకుండాసంవత్సరాల తరబడి జైలుగోడల మధ్య గడిపారు.

ఈ విధాంగా చివరి క్షణం వరకు రచయితగా, పాత్రికేయునిగా, కమ్యూనిస్టుగా, స్వాతంత్య్ర సమర యోధుడిగా, ప్రజల మనిషిగా బహుళ ఖ్యాతిని గడించిన కాకా బాబు ముజఫర్‌ అహమ్మద్‌ 1973 డిసెంబర్‌ 18న కలకత్తాలో కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌