పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

ఈ సంఘటన ఆధారంగా బ్రిటిష్‌ పాలకులు హిందూ-ముస్లింల మధ్యన మనస్పర్థలను సృషించాలని కుయుక్తులు పన్నారు. ఆ చర్యలకు విరుగుడుగా సమస్యను సానుకూలంగా పరిష్కరించడంతో మౌల్వీ అబ్దుల్‌ బారికి మంచి గుర్తింపు లభించింది.

ఆ సమయంలో బల్కాన్‌ యుద్దం ప్రారంభమైంది. ఆ సందర్బంగా అలీ సోదరులతో చర్చించి 'అంజుమన్‌-ఏ-ఖుద్దాం-ఏ-కాబా' అను సంస్థను ఏర్పాటు చేశారు. ముస్లింల పవిత్ర స్థలాలను కాపాడాలన్నది ఈ సంస్థ బహిర్గత లక్ష్యం కాగా బ్రిటిష్‌ సామ్రాజ్యవాద శక్తుల పట్ల తీవ్ర వ్యతిరేకతను బలోపేతం చేయడం అంతర్గత లక్ష్యంమైంది. ఈ రహస్యం ప్రభుత్వ నిఘా నుండి ఎంతో కాలం దాగలేదు.

మౌల్వీ బారి 1918లో మొట్టమొదటి సారిగా ఢిల్లీలో గాంధీజీని కలుసుకున్నారు. ఖిలాఫత్‌ సమస్య గురించి, ముస్లిం ప్రజల మనోభావాల గురించి ఆయనతో ప్రస్తావించారు. ఆ చర్చల పర్యవసానంగా మౌల్వీ బారి గాంధీజీతో కలసి ఖిలాఫత్‌-సహాయ నిరాకరణోద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆయన కృషి ఫలితంగా 'అఖిల భారత ఖిలాఫత్‌ కమిటీ' ఏర్పడింది. ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యామాన్నిమరింత ఉదృతం చేసే లక్ష్యం తో 'జమాయతుల్‌-ఉలేమా-ఏ-హింద్‌' ఏర్పాటులో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. మౌల్వీ అబ్దుల్‌ బారి మార్గదర్శకత్వం లోని విద్యాకేంద్రం విద్యార్థులు జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర నిర్వహించి కఠిన శిక్షలకు గురయ్యారు.

ఈ సందర్బంగా ఆచరణాత్మక చర్య ల ద్వారా హిందూ-ముస్లింల ఐక్యతకు ఆయన అవిశ్రాంతంగా శ్రమించారు. ఆయన తన ప్రత్యే కమైన పద్దతులతో మానవ సంబంధాలను మరింత పటిష్టపర్చారు. మౌల్వీబారి కృషిని చూసి మహాత్ముడు కూడా ఆశ్చర్యపోవడమే కాకుండా ప్రజలంతా ఆయనను, ఆయన విధానాలను అనుసరించాలని బోధించారు.

మౌల్వీ బారి మంచి రచయిత, వక్త. ఆయన ఉర్దూలో వందకు పైగా పుస్తకాలు రచించారు.'అల్‌-నిజామియా' అను ఉర్దూ మాసపత్రికను నడిపారు. ఈ పత్రికను బ్రిటిష్‌ పాలకుల దాష్టీకాలను ప్రజల ముందుకు తెసూ,ప్రభ్త్వ వ్యతిరేక ప్రచారానికి, హిందూ- ముస్లిం ఐక్యతకు, ఇస్లామిక్‌ తత్వశాస్త్ర విశ్లేషణకు, ఇస్లామిక్‌ ఆచార సాంప్రదాయాలను, తమ సంస్థ లక్ష్యాలను ప్రజలకు ఎరుకపర్చడానికి సమర్థవంతంగా ఉపయోగించారు.

ఈ విధంగా ధార్మిక, రాజకీయ సామాజిక, సాహిత్య, విద్యారంగాలలో విశిష్టమైన ప్రతిభను కనబర్చి విద్యావేత్తగా, ప్రముఖ జాతీయవాదిగా, స్వాతంత్య్రసమరయోధుడిగా, అత్యుత్తమ సేవలను అందించిన మౌల్వీ ఖయాముద్దీన్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ బారి ఫిరంగి మహాల్‌ 1926 జనవరి 19న చివరిశ్వాస విడిచారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌