Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

పచ్చవిల్తునికాఁక నొచ్చినదేహంబు
             నీచల్లకౌఁగిట నిలుపకున్న
వెన్నెలమంటచే వేఁగు చన్దోయి నీ
             కరవారిజంబులఁ గప్పకున్న
వేఁడినిట్టూర్పుల వెచ్చనౌమోవి నీ
             యధరామృతముచేత నార్పకున్నఁ
జెలులు చెప్పఁగ నైన చింతాభరంబు నీ
             తియ్యనిపల్కులఁ దీర్పకున్న


తే.

నెవ్విధంబున నీవల పీఁదనేర్తు
ననుచు నమ్మునికే లంట నతఁడు దొడ్డ
బ్రహ్మవిద్య మనంబునఁ బాదుకొలిపి
దానిచేతకు రోసి డెందమునఁ గినిసి.

86


శా.

కంఠారావ మొనర్చె నత్తఱి మహోగ్రస్ఫూర్తి దిఙ్నాగముల్
గుంఠీభూతమదంబులై వడఁకఁగా గోత్రంబు లూటాడఁగాఁ
గంఠేకాలసరోరుహప్రభవనాకస్వామిభోగీంద్రవై
కుంఠు ల్దద్దరిలంగ లోకములు సంక్షోభంబునం బొందఁగన్.

87


క.

భూపాలక విను తుల్యుఁడు
శాపజలం బపుడు కేల సవరించి మహా
కోపస్ఫురితాధరుఁడై
యాపడఁతుకఁ జూచి యిట్టు లనియెం బెలుచన్.

88


ఉ.

ఓసి దురాత్మురాల, వినయోక్తులచే నను వెఱ్ఱిఁ జేయు పే
రాసలు మాను నిప్పు చెదలంటఁగ నేర్చునె బల్మిఁ బైఁ బడం
గా సమకట్టి చేరితివిగానఁ దురంగమ వై చరింపు నీ
మై సొబగెల్లఁ బొల్లుపడ మర్త్యుని మోచి ధరాతలంబునన్.

89