Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గోరిక గొల్వఁ దారకలలోని శశాంకునిఁ బోలియుండఁగన్.

77


వ.

అయ్యవసరంబున బదరికాశ్రమవాసు లగుభరద్వాజకణ్వ
కశ్యపవసిష్ఠవామదేవాదిమునీంద్రులు చనుదెంచి మొగ
సాల గడచి నిలిచి దౌవారికులచేతఁ దమరాక యవ్విభున
కెఱింగించి తదనుజ్ఞాపూర్వకంబుగా నాస్థానంబుఁ బ్రవే
శించి యమ్ముకుందునిచేత నుచితసత్కారంబులఁ బడసి సుఖా
సీనులై యుండ నద్దేవదేవుం డాగమనప్రయోజనం బడిగిన
నమ్మును లిట్లనిరి దేవా, నరకాసురుం డను దానవేంద్రుండు
ధరణీమండలంబునఁ గల రాజకన్యకలం గొని చని కారా
గారంబున నిడి తక్కినభువనంబులం గలంచుచున్నవాఁడు
గావున నతనిం బరిమార్చి సమస్తజనుల రక్షింపుము.

78


తే.

అనిని దానవకోటి నుక్కడంచి సాధు
జనులఁ గరుణ దలిర్ప రక్షణ మొనర్చు
నీవ యక్కుజను నరకు నేలఁగూల్చి
భువనములనెల్ల దయతోడఁ బ్రోవవలదె.

79


వ.

అని విన్నవించిన యమ్మునిముఖ్యులపలుకు లంగీకరించి యని
పిన వారు నిజనివాసంబుల కరిగి రంత నరకాసురవధార్థంబు
ప్రయాణోన్ముఖుండై సత్యభామకు నెఱింగించి యయ్యం
గనాసమేతుండై గరుడారోహణంబు గావించి ప్రాగ్జ్యో
తిషపురంబు దఱియం జని.

80


ఉ.

ఆపురరక్షకాసురుల నందఱఁ జక్రమునన్ హరించి యా
టోపముతో మురాసురుఁ గఠోరకరాసి నడించి చాపవి
ద్యాపరుఁడై మదాంధునరకాసురుతోడ రణాంగణంబులో
నేపు దలిర్పఁ బోరి యొకయించుక కృష్ణుఁడు డస్సియున్నచోన్.

81