Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బ్రసవతోరణరణద్భ్రమరగీతములతోఁ బుణ్యసాధ్వీగానములు సెలంగ
వందివైతాళికవ్రాతసన్నుతులతో యతికృతాశీర్వాదరుతు లెలర్ప
ననఘ శుభవస్తుపూరితకనకపాత్ర, పాలికలతో సువాసీసు ల్మ్రోల నడువ
నుద్ధవాక్రూరబలముఖ్యయుక్తుఁ డగుచు, యదుకులాధీశ్వరుఁడు వెంట నరుగుదేర.

172


క.

అలఘుతరశ్రీఁ గదిసిన, నెలమి నెదుర్కొని విదర్భనృపుఁ డతని పదం
బులు గడిగి భర్మమయని, ర్మలపీఠిక నునిచి యొసఁగె మధుపర్కంబున్.

173


చ.

గవిసెనఁ బూనినట్టిరతికాంతునికార్ముకవల్లియో యనం
బవిరిముసుంగు వెట్టి నలుపజ్జఁ జెఱంగులు కూడఁబట్టుచుం
గువలయలోచన ల్చవికకుం గొనితెచ్చిరి వెంట నైదువల్
ధవళముఁ బాడ భోజవసుధావరరాజతనూజ నత్తఱిన్.

174


గీ.

కుముదినీచంద్రభానుమధ్యమున నప్పుడు, తళుకువెన్నెలపగిది బాంధవచకోర
కోటి యుప్పొంగ శ్యామానిగుంభనమున, దీపితంబైన వెలిపట్టుతెఱ యెసంగె.

175


ఉ.

సంవిదపారగౌరవవిచక్షణు లైనధరాసురేంద్రు లే
వంవిధభద్రవేళ శుభవస్తులఁ బేర్కొనుచు “న్వధూవరా
భ్యాం వరదా భవం" తనుచు హర్షమునం బులకాంకురావళీ
సంవృతగాత్రుఁ డైననృపచంద్రున కెంతయు నెచ్చరించుడున్.

176


శా.

శ్రీరామారమణాత్మజన్మునకు లక్ష్మీనందనాకారరే
ఖారమ్యోజ్జ్వలరూపధేయునకుఁ దత్కన్యాశిరోరత్నమున్
ధారాపూర్వముగా నొసంగె నలవైదర్భుండు కంసారి కం
భోరాశీంద్రుఁడు లచ్చి నిచ్చుపగిదిం బూర్ణానుమోదంబునన్.

177


శా.

నారీరత్నము చారుహస్తకమలాంతఃకర్ణికాకేసరా
కారంబు ల్గుడజీరకంబు లిడియంగాఁ బట్టి మంజీరముల్
గేరన్ గ్రక్కున నిక్కి భర్తతలపైఁ గే లానించి నిల్పెన్ "ధ్రువం
తే రాజా వరుణో ధ్రువ" మ్మనుచు ధాత్రీనిర్జరు ల్పల్కఁగన్.

178


క.

గాంగేయగాత్రిగళమున, మంగళసూత్రంబుఁ గట్టె మాధవసుతుఁ డా
నంగాధిరాజ్యమున కెసఁ, గం గట్టిన తోరణంబుక్రమము దలిర్పన్.

179


మ.

చరణంబు ల్ధరనత్తఁమిల్లఁగ నుదంచన్మధ్యనీవీపరి
స్ఫురణ న్నాభి యొకింత దోఁపఁ గుచము ల్పొంగార దోర్మూలభ
ర్మరుచు ల్మించుల మించ నించెఁ దలఁబ్రా ల్రాజాస్య తత్తన్మనో
హరతాదర్శననమ్రుఁడైన పతిపై యత్నానపేక్షంబుగన్.

180