Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

ప్రఖ్యాతాగమ[1]మంత్రరాజములు పైపైఁ గుంభీనీదేవతా
ముఖ్యు ల్విన్ప వరుండు తన్మృదుపదాంభోజాతసంస్పర్శభూ
సౌఖ్యశ్రీ నడిపించె సప్తపదము ల్సారంగశాబేక్షణ
"న్సఖ్యం సాప్తపదీన" మన్పలుకు డెందాన న్విచారించుచున్.

181


ఉ.

రాజతనూజయుక్త యయి రంజిలి వేలిమి వేఁడి వేల్పులో
లాజలు వేల్చె భోజసుత లాలితసాంధ్యగభస్తిఁ దారకా
రాజి ఘటింప బాలదినరాజసమేతవిభాతలక్ష్మికిం
దా జతయై ప్రఫుల్లముఖతామరసస్ఫురణంబు మించఁగన్.

182


సీ.

దివ్యసేవ్యారుంధతీవసిష్ఠాదిదంపతులు దీవన లిచ్చి రతులఫణితిఁ
బ్రార్థితసాంగవేదాఖిలక్షితిసురోత్తము లభీష్టము గాంచి రమితగరిమ
యదువిదర్భాన్వవాయనిధేయబంధువర్యులు వీళ్లు చదివించి రుచితవృత్తి
మహితోత్సవాయాతబహుదేశరాజచంద్రులు విందులు భుజించి రలఘులీల
బ్రబలగాయకనర్తకపాఠకాద్య, నేకవిద్యాధురీణు లీహితముఁ బడసి
రుర్వి లక్ష్మీశ్వరుఁడు సేయునుత్సవంబు, సకలభువనాద్భుతోన్మేషశాలి గాదె.

183


క.

ఈమాడ్కిన యనువింద, క్ష్మామండలనాథునింట సాత్యకితనయ
గ్రామణిపాణిగ్రహణమ, హామహితోత్సవము సాంగమై విలసిల్లెన్.

184


ఉ.

ఆతఱి రుక్మబాహువిభుఁ డాత్మసుతాకరపీడనోత్సవా
యాతసమస్తదేశవసుధాధిపచంద్రుల నంచె సత్క్రియా
జాతవినూతనప్రమదసాంద్రులఁ జేసి యనూనదానవి
ద్యోతితపంచశాఖి విజయోత్సవతేజితపంచశాఖియై.

185


సీ.

మణిరాజధరవంశ్యమండనంబునకు నీమణులు యోగ్యము లంచుఁ బ్రణుతి సేయఁ
గరివరావనవిచక్షణసత్కులేంద్రున కర్షంబు లీకరు లని గణింపఁ
హరిమహోదయనూతనాసమహరికి నీవారు లుచితంబులం చభినుతింప
నగణితకాంతాప్రియకుమారమదనున కనురూప లీకాంత లని తలంప
నసదృశామూల్యరత్నగంధాంధహస్తి
మల్లసామ్రాణికాశ్వరంభానిభాభి
రామరామాతతుల నిచ్చె మామ యహిమ
భానుసమభానునకుఁ జంద్రభానునకును.

186
  1. చ-మంత్రనాదములు