Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుముదిని లక్ష్మీమందిరమునకు వచ్చుట

చ.

ధరణితలేంద్రనందనవిధంబు గనుంగొనఁగోరి మున్ను కి
న్నరవరుఁ డిచ్చినట్టిభువనస్తుత మైనయదృశ్యవిద్య న
య్యిరువురు గుప్తమూర్తు లయి యిందుసహోదరిమందిరంబునం
దరలక యుండి రట్టియెడఁ దన్వియుఁ జేరఁగవచ్చి యచ్చటన్.

90


గీ.

జనులఁ గంచుకినిచయంబు జడియ వేత్ర
ధరలతాంగులు కొంద ఱెచ్చరికఁ దెలుప
[1]బాల లిరువంకఁ గరములఁ బంజు లూనఁ
బొలఁతుకలు మ్రోల రాఁగ గోపురము సొచ్చి.

91


చ.

జిలిబిలికమ్మఁదేనియలు చిల్కఁగఁ బల్కెడుపంచవన్నెరా
చిలుకలపంజరాలగమిచే నలరారెడు రంగమండపం
బలసత నెక్కి కూర్మిసఖు లందఱు వెంటనె రాఁ గరంబునన్
నిలుఁడని యడ్డగించి తరుణీమణి గర్భగృహంబులోనికిన్.

92


గీ.

సారెనియమరహస్యపూజాచ్ఛలమున, నొంటి నేతెంచి విజనమై యునికిఁ దెలిసి
రత్నమయ మగుతద్గృహాంతరముఁ జేర్చి, నళినగేహకు సాష్టాంగనతి యొనర్చి.

93


క.

ఈనళినగేహతనయుఁడు, కానను వలవంతఁ గుందఁగాఁ జేసెఁ గటా
యేనీసతి కిందులకై, ప్రాణము లర్పింతు ననుచు బద్ధోద్యమయై.

94


సీ.

భవదాత్మజశిలీముఖవివర్ణితం బని తలఁపక కర్ణిణోత్పలము గాఁగఁ
డ్వత్తనూభవవృషత్కమలీమస మని యరయక లీలాముకురమ్ము గాఁగ
భవదపత్యశరవృష్టివిదారితం బని కనక కెంగేలిపంకజము గాఁగఁ
ద్వత్కుమారాశుగధౌర్త్యాకులం బని తెలియక పెంచినతీవ గాఁగ
నవధరింపఁగదమ్మ లోకైకజనని, కనుఁగవయు గండతలము నాననముఁ దనువు
[2]పార్థివావయవముల పాల్పడకయుండఁ, బ్రీతి నసువులు నీకు నర్పింతుఁగాన.

95


చ.

అని యురి గాఁగఁ బయ్యెద నతానన యై నిజకంఠసీమఁ జే
ర్చినఁ గరుణార్ద్రచిత్త యయి చెందొవరాసయిదోడు చెల్లఁబో
నను నపకీర్తిఁ బాల్పడ నొనర్పఁగఁ జూచితి వంచుఁ గేలు కే
లునఁ గదియంగఁ బట్టి మదిలోని తలం కెడలంగ నిట్లనున్.

96
  1. చ-బాలకియు డిగ్గి జతగానిపంజు లూని, ట-పాలకీ డిగ్గి జతగానిపంజు పూని
  2. క-పార్థివావయవదయములు పడకయుండ