Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యసదుదీవియమీఁద నలరుక్రొవ్విరిఁ జూచి నతలతామధ్యమనాభిఁ దలఁచి
పువ్వుగుత్తులమీఁదఁ బొలయుపుప్పొడిఁ జూచి గుచ్ఛవక్షోజుపైకొంగుఁ దలఁచి
తగులు నెగులును దిగులును దత్తఱంబు, నలుకు నులుకును దలఁకును నాదరంబు
మనమున జనింపఁ దద్వనీమధ్యసీమ, నంగనామణి వెదకి కానంగలేక.

83


ఉ.

వేగిరపాటుతో నపుడు వెల్వడి యొయ్యన శేషభూమిభృ
ద్భాగము డిగ్గి యాకులత దార్కొనుచిత్తముతోడఁ గుందునన్
దోగెడఁ గూడి యధ్వగులు దోడ్కొనివచ్చిన నప్పు డేను ని
న్నీగుడిలోనఁ గాంచితిఁ జెలీ యని యంతయుఁ జెప్పి వెండియున్.

84


సీ.

గాజుకుప్పెలవంటి గబ్బిగుబ్బలు గోర నంటిన వ్రీలుఁగా యనుచుఁ గొంకి
దిరిసెనపూవంటి తిన్ననిమై కేల నలమిన వాడుఁగా యనుచుఁ గొంకి
కండచక్కెరవంటి కమ్మనివాతెఱ నానినఁ గరఁగుఁగా యనుచుఁ గొంకి
చికిలియద్దమువంటి చిన్నినెమ్మో మూర్పు లడరినఁ గందుఁగా యనుచుఁ గొంకి
తళుకునెలకూన లునుపక తనివి తీఱఁ, గౌఁగిలింపక కెంపులు గలుగ నిడక
నలరువలపులు గ్రోల కందంద కనుచు, నూరకే మోసపోయితి నోవయస్య.

85


క.

అని యాద్యంతం బేర్పడఁ, దనవృత్తాంతంబుఁ దెలుపఁ దమ్ముఁడుఁ దానున్
జననాథమౌళి యొండొరు, ననునయమునఁ గలఁకఁదేఱునంతటిలోనన్.

86

సాయంకాలవర్ణనము

మ.

కలయ న్నీడలు తూర్పు సాఁగె నళిను ల్కంజాతము ల్వాసెఁ గొం
దల మందెన్, కవజక్కవ ల్తరణికాంతశ్రేణి చల్లారె మి
న్నుల నేగెం బులుఁగు ల్చకోరికల ఱంతు ల్గొంత దీపించె ను
త్పలము ల్విచ్చె నినుండు పశ్చిమకుభృద్భాగంబున న్నిల్వఁగన్.

87


క.

జలరాశి యనెడుబోయల, తలదొర చరమాద్రిపేరి తడికమఱువునన్
నిలిచి కిరణంపుటురి గో, లలఁ దిగిచెఁ బతంగమండలం బవ్వేళన్.

88


సీ.

తొలుదొల్త వినవచ్చె నలఘుకోలాహలం బామీఁదఁ దోఁచె వాద్యములరవళి
తరువాత నెఱిఁ జూపె దంతిఘీంకారంబు నంతటఁ దులకించె నశ్వహేష
పిమ్మటఁ దలమయ్యె బృథుకంచుకధ్వను లావెన్కఁ దనరెఁ దొయ్యలులపాట
పెద్ద మ్రోసెను వారభీరునూపురరుతు లాపై నెగడె వయస్యానులాప
మప్పు డాయాదవాన్వయు లారవంబు, సారె నాలించి లగ్న మాసన్న మైన
ధరణినాథుండుతనయ నిందిరకు మ్రొక్క, ననిచెనో యని భావింప నాక్షణమున.

89