పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

ఘటికాచలమాహాత్మ్యము


ఉ.

అప్పుడు వేలుపున్ సకియ లందఱు జోడుగనుద్ది గూడి డా
ల్చిప్పలు వన్నియల్ [1]వదలి చిత్రపు చందురకావి పావడల్
గప్పి కటీతటమ్ముల [2]చెలంగి కరమ్ముల నీలశృంగముల్
ద్రిప్పుచు మోదవారివిధిఁ దెప్పలఁ దేలుచు హాళి మీఱగన్.

125


ఉ.

తీరముఁ జేరు సౌరసుదతీతతినీడలు తేటయౌ సరో
వారిఁ దనర్చె తత్కమలవాసిని [3]తాను ననేకమూర్తులై
వారి నెదుర్కొనం దలచి వచ్చెను నా నది యట్టులే కదా
కూరిమిగల్గు నెచ్చెలులకున్ సయిదోడుల కెన్ననేటికిన్.

126


గీ.

జిలుగు ఱవికల లోపల నలరుబోండ్ల
గబ్బి సిబ్బెంపు బిగి వలి గుబ్బ లమరె
చిత్తజాతుని యురులలోఁ జిక్కి యున్న
కలికి పెక్కువ జక్కవ కవల [4]కరణి.

127


గీ.

అరుణ కిరణోద్ధతిని వాడు నచ్చరలను
గను గొని సరోజగేహిని కరుణమీఱ
వెల్లగొడుగులు పట్టించు వితము మించ
నంచగమి నిల్చియాడె చాలగుచు దివిని.

128


చ.

పలుకుల పంతముల్ గులుక బారులుదీరి కొలంకుసొచ్చి యా
కులుకుమిటారిగుబ్బెతలు గుబ్బచనుంగవబంటిలోతునన్
నిలిచి యొకళ్ళకళ్ళపయి నీరజ కైరవ హల్లకోత్పలం
బుల [5]నిగుడించుచుం గదిసి బుఱ్ఱటకొమ్ములఁ జిమ్ములాడుచున్.

129


గీ.

కఠిన వక్షోజశైల సంఘట్టనమునఁ
దిరిగె దరఁగలు భూమి భృద్వరుల సత్వ
గరిమ నెంచని బలుమొనకాళ్ళమీద
నడరు జడమూర్తులకు [6]గెలుపగునె యెందు?

130
  1. సడలి. తా.
  2. చెలంగ. పూ. ము. తా.
  3. తాల్మిన. పూ. ము.
  4. కరుణ. తా.
  5. నిగుడింపుచున్.
  6. గ్రేలువగు.